Regards Gandhi

*గాంధీజీ సమైక్యతా స్ఫూర్తితో ఉద్యమం*- *నేడు గాంధీ వర్థంతి*
------------------------------------------------------
*ఆనాడు హిందూ, ముస్లిం మత విభజనకు కుట్రలు చేస్తున్న బ్రిటన్‌ పక్కన చేరి ఒక వైపు జిన్నా, మరో వైపు ఆర్‌ఎస్‌ఎస్‌ మత విద్వేషాలు సృష్టించాయి. వాటిని తిప్పికొట్టి ప్రజల ఐక్యతను కాపాడేందుకు గాంధీజీ పూనుకున్నారు. తాను బలమైన హిందూ మత విశ్వాసి అయినప్పటికీ మత సామరస్యమే స్వాతంత్య్ర సాధనకు, భారత ప్రజల ఉన్నతికి దోహదం చేస్తుందని నమ్మి ఆచరించారు.*


*2020 జనవరి 30. గాంధీజీ 72వ వర్థంతి. 1948 జనవరి 30న గాంధీజీ హత్య జరిగింది. 'ఈశ్వర్‌ అల్లా తేరేనామ్‌: సబ్‌కో సన్మతి దే భగవాన్‌' అని ప్రార్థించి వెలుపలకు రాగానే ఒక మతోన్మాది వినాయక్‌ నాదూరాం గాడ్సే ఆయనను కాల్చి చంపాడు. 72 ఏళ్ల తర్వాత అదే గాడ్సేను 'భారత రత్న' తో సత్కరించాలని డిమాండ్‌ చేస్తున్న సాధ్వి(?) ప్రజ్ఞాసింగ్‌ లోక్‌సభలో పాలకపార్టీ సభ్యురాలిగా ఉన్నారు! ఇప్పుడు దేశాన్ని ఏలుతున్న వారు గాడ్సే వారసత్వాన్ని నరనరాన వంటబట్టించుకున్నారు. భారత రాజ్యాంగ మౌలిక లక్షణమైన లౌకిక తత్వాన్ని దెబ్బతీయడానికి కుట్రలు చేస్తున్నారు. నేడు మరలా దేశాన్ని మత కల్లోలం వైపు తీసుకెళ్తున్నారు. మత విద్వేషాలు సృష్టిస్తున్నారు. లౌకిక భారతావనికి జీవితాంతం కృషి చేసిన గాంధీజీ స్ఫూర్తితో ఈ దుష్ట శక్తుల నుండి లౌకిక భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని ప్రతి పౌరుడూ ప్రతిన బూనాల్సిన తరుణమిది. మత సామరస్యం కోసం ప్రతి పౌరుడూ మాట్లాడాల్సిన సమయమిది.*


*సిద్ధాంత పరమైన భిన్నాభిప్రాయాలు ఎన్ని ఉన్నప్పటికీ...మోహన్‌దాస్‌ కరమ్‌చంద్‌ గాంధీ...జాతీయోద్యమాన్ని విశాల ప్రజా ఉద్యమంగా మలిచారన్న వాస్తవాన్ని ఎవరూ విస్మరించలేరు. ఆనాడు హిందూ, ముస్లిం మత విభజనకు కుట్రలు చేస్తున్న బ్రిటన్‌ పక్కన చేరి ఒక వైపు జిన్నా, మరో వైపు ఆర్‌ఎస్‌ఎస్‌ మత విద్వేషాలు సృష్టించాయి. వాటిని తిప్పికొట్టి ప్రజల ఐక్యతను కాపాడేందుకు గాంధీజీ పూనుకున్నారు. తాను బలమైన హిందూ మత విశ్వాసి అయినప్పటికీ మత సామరస్యమే స్వాతంత్య్ర సాధనకు, భారత ప్రజల ఉన్నతికి దోహదం చేస్తుందని నమ్మి ఆచరించారు.*


*నేటి పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ ఆనాటి బ్రిటిష్‌ ఇండియాలో అంతర్భాగం. 1857 ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో హిందూ, ముస్లిం ప్రజలు ఐక్యతతో పోరాటం చేశారు. బ్రిటన్‌ను గడగడ లాడించారు. అది గమనించిన బ్రిటీష్‌ సామ్రాజ్యవాదులు, హిందూ, ముస్లిం ప్రజల విభజనతోనే భారత దేశంలో తమ పాలన దీర్ఘకాలం సాగించగలమన్న నిర్ణయానికి వచ్చారు. భారతదేశంలో మతం, కులం, భాష, జాతి, తదితర భిన్నత్వాన్ని వైషమ్యంగా మార్చి ప్రజలను విభజించి, పాలించే సామ్రాజ్యవాద ఎత్తుగడలను జాతీయోద్యమం ఎదుర్కోవాల్సి వచ్చింది.*


*అడుగడుగునా విభజించే శక్తులను ఎదుర్కోవడం భారత జాతీయోద్యమ నాయకత్వం ముందు ప్రధాన, నిరంతర కర్తవ్యంగా నిలిచింది. కాంగ్రెస్‌ నాయకత్వంలో ఉధృతంగా సాగుతున్న జాతీయోద్యమం నుండి 'ఆలిండియా ముస్లిం లీగ్‌' ఏర్పాటుతో మొదలై మత ప్రాతిపదికన పాకిస్తాన్‌ దేశాన్ని ఏర్పరచాలని జిన్నా పట్టు పట్టడం వెనుక బ్రిటిష్‌ సామ్రాజ్యవాదుల విభజన కుట్ర ఉంది. జిన్నా ద్విజాతి సిద్ధాంతానికి 'స్వయం సేవక్‌ సంఘం' (బిజెపి మాతృ సంస్థ) తోడ్పాటు అందించింది. సామ్రాజ్యవాదంపై పోరాటాన్ని సాగించడానికి బదులు ముస్లిం వ్యతిరేకతతో హిందూ మత రాజ్య స్థాపన లక్ష్యంతో ఆర్‌.ఎస్‌.ఎస్‌ పని చేసింది. అందుకు మత మారణహోమం సృష్టించింది.మరో వైపు హిందూ మతంలోనే సవర్ణ హిందువులు-అస్పృశ్యులకు మధ్య గల విభేదాన్ని బ్రిటిష్‌ సామ్రాజ్యవాదులు వాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భారత ప్రజలను ఐక్యంగా నిలబెట్టి జాతీయోద్యమం నడపడం చాలా జఠిలమైంది.*


*గాంధీజీ అంగీకరించనప్పటికీ దేశం రెండుగా విడగొట్టబడింది. మతకల్లోలాలు చెలరేగాయి. మతోన్మాద శక్తులు మారణహోమం సృష్టించాయి. ఈ మారణహోమంలో వేలాది మంది ప్రజలు హతులయ్యారు. విభజన జరిగినందుకు మనస్తాపం చెంది మహాత్ముడు ఆనాడు స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనలేదు. ప్రజలు మతోన్మాదానికి బలైపోతున్న ప్రాంతాల్లో పర్యటించి మత సామరస్యం కోసం తీవ్రంగా కృషి చేశారు. 'హిందూ ముస్లిం భాయి భాయి, ఈశ్వర్‌ అల్లా తేరే నామ్‌' అంటూ మత కల్లోలం జరుగుతున్న ప్రాంతాల్లో మత సామరస్యంపై పర్యటించారు. మతోన్మాదమే తప్ప మత సామరస్యమే గిట్టని ఆర్‌.ఎస్‌.ఎస్‌, గాంధీజీ కృషిని సహించ లేకపోయింది.*


*ఢిల్లీ లక్ష్మీ నారాయణ ఆలయంలో ప్రార్థన చేసి వస్తున్న గాంధీజీని పాదాభివందనం చేస్తున్నట్లు నటించి కాల్చి చంపేశాడు గాడ్సే. ఆ హత్యను దేశమంతా తీవ్రంగా ఖండించింది. జాతిపితను కాల్చి చంపడం భారత దేశ ద్రోహులకే సాధ్యమైంది. గాంధీ మహాత్ముడి హత్యకు ప్రణాళిక రచించి, అమలు జరిపింది 'రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘం. దాని నాయకుడు వి.డి సావర్కర్‌. హత్య అనంతరం ఆర్‌.ఎస్‌.ఎస్‌ నాయకులు తనను ప్రశంసిస్తారని, మంచి పని చేశావని ప్రకటిస్తారని ఆశించిన గాడ్సేకు ఆశాభంగమే ఎదురైంది. గాడ్సేకూ మాకూ సంబంధం లేదని ఆర్‌.ఎస్‌.ఎస్‌ ప్రకటించింది.* 


*దేశ ప్రజల ఆగ్రహం నుండి, హత్యా నేరం నుండి తప్పించుకునేందుకు పచ్చిగా అబద్ధం చెప్పేసింది. కానీ ఆధారాలన్నింటిని పరిగణన లోకి తీసుకుని గాంధీ హత్య వెనక ఆర్‌.ఎస్‌.ఎస్‌ కుట్ర వుందని గుర్తించిన నాటి హోంమంత్రి సర్దార్‌ వల్లభభారు పటేల్‌ ఆర్‌.ఎస్‌.ఎస్‌ను నిషేధించారు.*


*గాంధీ హత్యతో ప్రజల ఆగ్రహానికి, ఛీత్కారానికి ఆర్‌.ఎస్‌.ఎస్‌ గురైంది. దాని రాజకీయ సంస్థ జన సంఘం కూడా ప్రజల తిరస్కారానికి గురైంది. జనసంఘ్ ను మహాత్ముని హంతక సంస్థగా ప్రజలు భావించి, రాజకీయంగా తిరస్కరించారు. అయితే ఎమర్జెన్సీ కాలంలో జె.పి ఉద్యమం ద్వారా జన సంఘం అందరిలో కలిసి పోయింది. జనతా పార్టీలో భాగమైంది. అధికారం లోకి వచ్చిన జనతా ప్రభుత్వంలో భాగస్వామి అయింది. కాని ద్వంద్వ సభ్యత్వం వివాదంతో ప్రభుత్వాన్ని కూల్చేసింది. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీని, ప్రజలు రెండు స్థానాలకు పరిమితం చేశారు. తదుపరి భారతీయ జనతా పార్టీగా పేరు మార్చుకొని జన సంఘానికి వున్న అప్రతిష్ట నుండి ప్రజల దృష్టిని మళ్లించింది.*


*'గాంధేయ సోషలిజం' తెస్తానని ప్రకటించి గాంధీ పేరును ఉపయోగించుకొని ప్రజలను మోసం చేయడం మొదలు పెట్టింది. ఎన్నో మాయలు, కుతంత్రాల తోనూ, కార్పొరేట్ల తోడ్పాటుతో ఆర్‌.ఎస్‌.ఎస్‌ రాజకీయ విభాగంగా బిజెపి బలపడింది. బిజెపి అధికారం చేపట్టడంతో గాంధీని చంపిన గాడ్సేను హీరోగా బిజెపి ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులు ప్రకటిస్తున్నారు. 'గాడ్సేకు గుడి కడతాం' అనేంత వరకూ వెళ్ళారు. ఆనాడు గాడ్సే తమ వాడు కాదని చెప్పిన వాళ్ళే నేడు గాడ్సే వారసులుగా చెప్పుకునేందుకు గర్వపడుతున్నా మని బహిరంగంగా ప్రకటిస్తున్నారు.*


*మతం ప్రాతిపదికన బిజెపి పౌరసత్వం కలిగిస్తున్నది. ఈ దేశంలో పౌరసత్వం పొందడానికి మతం ప్రాతిపదిక కాదు. అదే మన రాజ్యాంగ స్ఫూర్తి. అదే మనకు మహాత్ముడు సూచించిన బాట. కాని నేడు మోడీ ప్రభుత్వం ఆ రాజ్యాంగ మౌలిక స్ఫూర్తికే విఘాతం కలిగిస్తోంది. మతం పేరుతో ప్రజలను చీల్చేందుకు అన్ని విధాలా కుట్రలు సాగిస్తోంది. మతోన్మాదాన్ని జనం మస్తిష్కాల్లోకి ఎక్కిస్తోంది. మహాత్మా గాంధీ స్ఫూర్తితో మతోన్మాదాన్ని ఎండగట్టి ప్రజల మధ్య సామరస్యాన్ని కాపాడుకొని భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి. ఇదే మనం జాతిపితకు ఇచ్చే నిజమైన నివాళి.*


- *ఎం. కృష్ణమూర్తి ( వ్యాసకర్త సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు )*