గాంధీఆస్పత్రి : ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌ను ధీటుగా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్వం సిద్ధం చేశామని వైద్యశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. కరోనా నోడల్ కేంద్రమైన గాంధీ ఆస్పత్రిని వైద్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ యోగితరాణా, డిఎంఈ రమేష్‌రెడ్డిలు మంగళవారం సందర్శించి కల్పించిన వసతులు, సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. గాంధీ ఆస్పత్రి, మెడికల్ కాలేజీ పాలనయంత్రాంగం, వైరాలజీ ల్యాబ్ అధికారులు, సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం డీఎంఈ రమేష్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతు ప్రమాదకరమైన బయోమెడికల్ వేస్టేజీ డిస్పోజల్‌పై ప్రధానంగా చర్చించామన్నారు. నోడల్ కేంద్రమైన గాంధీ ఆస్పత్రిలో కరోనా వైరస్ కోసం 24 గంటలు అందుబాటులో ఉండే హెల్ప్‌లైన్ నంబర్ 9392249569ను ఏర్పాటు చేశామన్నారు.
ఈ నంబర్‌కు కాల్ చేసి కరోనా వైరస్ సమాచారం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వైరస్ లక్షణాలు తదితర అంశాలను తెలుసుకోవచ్చన్నారు. అత్యవసర విభాగంలోని కరోనా ఎక్యూట్ ఎమర్జెన్సీవార్డును కరోనా ప్రత్యేక ఐసీయుగా తీర్చిదిద్దేందుకు, ఐదవ అంతస్థులోని ఐసోలేషన్ వార్డులో ఆక్సిజెన్, వెంటిలేటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్లు, ఎన్–95 మాస్క్‌లు, రీఏజెంట్స్( లిక్విడ్స్) అందుబాటులో ఉంచామన్నారు. గాంధీ వైరాలజీ ల్యాబ్‌లో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం పడుతుందని డీఎంఈ రమేష్‌రెడ్డి వివరించారు. కార్యక్రమంలో గాంధీ సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్, ఇన్‌చార్జి ప్రిన్సిపాల్, మైక్రోబయోలజీ హెచ్‌ఓడీ నాగమణి, డిప్యూటీ నర్సింహరావునేత, కరోనా నోడల్ అధికారి ప్రభాకరరెడ్డి, ఆర్‌ఎంఓలు జయకృష్ణ, శేషాద్రి ఆయా విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.